ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతడికి చదువు లేదు. జ్ఞానం అంతకంటే లేదు. కానీ తానో మేధావినన్నట్టు ఊరివాళ్లందరి దగ్గరా డంబాలు పోయేవాడు. దాంతో ఊళ్లో వాళ్లందరికీ అతడిమీద కచ్చగా ఉండేది. ఓసారి అతడి నెలాగైనా ఇబ్బంది పెట్టాలని అంతా నిర్ణయించుకున్నారు.
మేమొక ప్రశ్న వేస్తాం, జవాబు చెప్తే మాంచి బహుమతి ఇస్తాం, చెప్పలేకపోతే నువ్వు తెలివిలేనివాడివని ఒప్పుకోవాలి, ఇంకెప్పుడూ నోరు తెరవకూడదు అన్నారు. అతడు సరేనన్నాడు. అందరూ కలసి ‘పాండవులు ఎందరు’ అని అడిగారు. అతడు ఆలోచనలో పడ్డాడు. ఎలాగూ చెప్పలేడని తెలిసి ‘పోనీ పంచపాండవులెందరు’ అనడిగారు. సమాధానం తెలియదంటే అవమానపడాల్సి వస్తుందని భావించిన ఆ వ్యక్తి... పంచపాండవులెందరో ఆమాత్రం తెలీదా, మంచం కోళ్లలాగ ముగ్గురు అంటూ రెండు వేళ్లు చూపించాడు. అంతే! అందరూ ఒక్కసారిగా ఘొల్లున నవ్వారు.
సమాధానం ప్రశ్నలోనే ఉంది. అయినా గుర్తు పట్టలేదు. పైగా మంచం కోళ్లు నాలుగుంటాయని కూడా తెలీక దాన్ని ఉదాహరణగా చెప్పాడు. లెక్కలు కూడా తెలీక రెండు వేళ్లు చూపించాడు. అప్పట్నుంచీ ఇలా అతి తెలివి చూపించేవాళ్ల గురించి మాట్లాడేటప్పుడు, అతడు చెప్పిన సమాధానాన్ని సామెతగా వాడటం మొదలుపెట్టారు.
No comments:
Post a Comment