Thursday, January 3, 2013

అంగారకుడు గురించి కొన్ని విశేషాలు



మనిషి తెలివైన జీవి అని మనం గర్వంగా చెప్పుకుంటాం. కాని మనిషి కంటే తెలివైన జీవులు అరుణగ్రహం (అంగారకుడు)లో జీవించాయని కొందరు పరిశోధకులు గట్టిగా నమ్ముతున్నారు. అంగారకుడిపై ఆనాడు కనిపించిన మానవ ముఖ రూపం నుంచి నిన్నా మొన్నటి గాంధీజీ ఆకృతి వరకు... కేవలం చిత్రాలు కావని... ఒకనాటి సంపన్న నాగరికతకు చెందిన సూచన ప్రాయమైన గుర్తులని అంటున్నారు. ఆ కథేమిటో తెలుసుకుందాం...
మన చిన్నప్పటి ఆకాశం పెద్ద కాన్వాస్. ప్రతి మేఘం చేయి తిరిగిన చిత్రకారుడి చిత్రమై మనల్ని గిలిగింతలు పెట్టేది. ఆకాశంలో నేను గుర్రాన్ని చూశానుఅని ఒకరంటే నేను ఏనుగును చూశానుఅని ఒకరు అనేవారు. మేఘాల్లో కనిపించే చిత్రవిచిత్రాలు అంగారక గ్రహంలోనూ ఎప్పటి నుంచో కనిపిస్తున్నాయి. తేడా ఏమిటంటే... మేఘాలు మన ఆనందానికి, ఆశ్చర్యానికి  మాత్రమే పరిమితం. కానీ అంగారకగ్రహంలో కనిపించే ప్రతి చిత్రం ఎప్పటికప్పుడు చర్చను రేకెత్తిస్తోంది.
సరికొత్త ప్రతిపాదనలకు కారణమవుతోంది. కొన్ని రోజుల క్రితం ఇటలీ అంతరిక్ష సంస్థ అంగారకగ్రహంపై ఉన్న శిలలపై గాంధీజీ రూపాన్ని గుర్తించినట్లు ప్రకటించింది. ఐరోపా మార్స్ ఆర్బిటర్ తీసిన చిత్రాల్లో గాంధీజీ రూపం స్పష్టంగా ఉంది! అంగారకుడిపై చిత్రాల సందడి నిన్నటి మొన్నటి విషయం కాదు. దీనికి చాలా చరిత్ర ఉంది.
1976లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా )కు చెందిన వైకింగ్-1 స్పేస్‌క్రాఫ్ట్ అంగారకుడి చిత్రాలను భూమి మీదకు పంపింది. ఆ చిత్రాల్లో సైడోనియ అనే ప్రాంతంలో మానవ ముఖ రూపం బయటి పడింది. ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన భౌగోళిక ఆకారం అని కొద్దిమంది అంటే అలా ఏర్పడింది కాదని కొందరన్నారు.
మరికొందరు మాత్రం చాలా ఏళ్ల క్రితమే అంగారకుడిపై తెలివైన నాగరికత వర్థిల్లిందని దాని తాలూకు ఒకానొక ఆనవాలే మానవ ముఖరూపంఅని చెప్పారు. కొందరైతే రెండు మూడు అడుగులు ముందుకు వేసి అంగారకుడిపై ప్రాచీన నాగరికత తాలూకు అంశాలను దాచి పెట్టే కుట్రను నాసా చేస్తోంది’’ అని ఆరోపించారు.
ఆశ్చర్యకరమైన ఒక విషయం ఏమంటే, వైకింగ్ చిత్రాల కంటే ముందుగానే...1958 సెప్టెంబర్‌లో ది ఫేస్ ఆన్ మార్స్పేరుతో కామిక్‌బుక్ వచ్చింది. విలియమ్‌సన్ రాసిన ఈ పుస్తకానికి జాక్ కిర్బె బొమ్మలు గీశాడు. ఈ కథలో అంగారకుడిపై వెళ్లిన అంతర్జాతీయ అంతరిక్షశాస్త్రవేత్తల బృందానికి అక్కడి కొండల్లో చెక్కిన మానవరూపం కనిపిస్తుంది! హైరిజుల్యుషన్ ఉన్న వైకింగ్ చిత్రాలు అందరికీ అందుబాటులో లేక పోవడంతో ఎవరి ఊహలకు అనుగుణంగా వారు వ్యాఖ్యానించుకునే పరిస్థితి ఏర్పడింది.
కొందరైతే అంగారక గ్రహంపై కనిపించిన మానవ ముఖంపై పుస్తకాలు రాసి హాట్ హాట్‌గా అమ్ముకున్నారు కూడా. అంగారకుడిపై మానవ ముఖంఅనే అంశం పుణ్యామా అని ఆరోజుల్లో మిగిలిన గ్రహాల కంటే అంగారకుడిపై ఆసక్తి పెరగడానికి కారణమైంది. అంగారకుడిపై హాలివుడ్‌లో సినిమాలు ప్రారంభమయ్యాయి. పత్రికల్లో, రేడియోల్లో వేడి వేడి చర్చ మొదలైంది.
స్పష్టాస్పష్టంగా కనిపించే రూపాలను ఆధారంగా చేసుకుని ఊహలు అల్లడం అనైతికంఅని హేతువాదులు వేడివేడిగా వాదనకు దిగే రోజుల్లో ఒక చిత్రం జరిగింది. అంగారకుడిపై ఏదో ఉందిఅని వాదించేవాళ్లకు అదొక అదృష్టంగా పరిణమించింది. 1998లో నాసాకు చెందిన మార్స్ గ్లోబల్ సర్వేయర్ స్పేస్‌క్రాఫ్ట్ అతి దగ్లర్లో నుంచి తీసిన అంగారకుడి చిత్రాలను భూమి మీదికి పంపింది. వైకింగ్ చిత్రాల కంటే ఇవి ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్నాయి. మానవ ముఖరూపం, కళ్లు, పెదాలు, ముక్కు... కొంత స్పష్టంగా గుర్తించడానికి వీలైంది.
మార్స్ ఆర్బిటర్ కెమెరా (ఎంఒసి) చిత్రించిన చిత్రాల ద్వారా అంగారకుడిపై మరి కొన్ని ఆకారాలను గుర్తించారు. ఒక చోట సీతాకోక చిలుక ఆకారం కనిపించింది. మరోచోట ఒక కొండ నత్త ఆకారం, దాన్నే మరో వైపు నుంచి చూస్తే కుక్క ఆకారం కనిపించింది. నవ్వుతున్న ముఖంతో కూడిన ఆకారం, ప్రేమగుర్తు కూడా ఎంఒసి చిత్రాల్లో కనిపించాయి. కొన్ని చిత్రాలలోని ఆకారాలు అంగారకుడిపై చెట్లు ఉన్నాయనే వాదనను లేవనెత్తాయి. అయితే శాస్త్రవేత్తలు ఈ వాదనను కొట్టిపారేశారు. ‘‘అంగారకుడిపై ఏర్పడిన ధూళిమేఘాలు వివిధరూపాలు ధరించి చెట్ల రూపాన్ని గుర్తుకు తెస్తున్నాయి తప్ప అక్కడ ఎలాంటి చెట్లు లేవు’’ అన్నారు వాళ్లు.
2007లో తీసిన ఒక ఫోటోలో ఒక వ్యక్తి మోకాళ్ల మీద కూర్చొని ప్రార్థన చేస్తున్న ఆకారం కనిపించింది. దీని ఆధారంగా అంగాకుడిపై జీవులు ఉన్నాయనే దానికి ఇదొక నిదర్శంఅని వాదించిన వాళ్లు ఉన్నారు.
కొన్ని సంవత్సరాల క్రితం అంగారుకుడిపై మిథేన్ వాయువు ఆనవాళ్లు కనుగొనడంతో అంగారకుడిపై జీవుల గురించి ఆసక్తి మళ్లీ తాజాగా మొదలైంది. అంగారకుడికి సంబంధించిన సమాచారంలో నిష్ణాతుడిగా పేరుగాంచిన ప్రొఫెసర్ కోలిన్ (బ్రిటన్) అంగారకుడిపై జీవుల ఉనికిని నిర్ధారించడానికి మీథేన్ వాయువు బలమైన నిదర్శనంఅని చెప్పారు. అంగారకుడిపై వాతావరణం లేని కారణంగా పగటి ఊష్ణోగ్రతకు, రాత్రి ఊష్ణోగ్రతకు మధ్య చాలా తేడా ఉంటుంది. ఫలితంగా అక్కడ జీవులు మనుగడకు అవకాశాలు తక్కువ అని కొందరు శాస్త్రవేత్తలు కోలిన్ నమ్మకాన్ని తోసిపుచ్చారు.
అంగారకుడిపై ఆశ్చర్యం గొలిపే ఆకారాలపై ఆసక్తి ఈనాటిది కాదు. 1784లో బ్రిటీష్ ఆస్ట్రానమర్ సర్ విలియమ్ హర్‌స్కెల్ అంగారకుడిపై చీకటిగా కనిపించే ప్రాంతాలు సముద్రాలు, చీకటి తక్కువగా ఉన్న ప్రాంతాలు భూభాగంఅని రాశారు. 1895లో పెర్సివల్ లొవెల్ అనే ఆస్ట్రానమర్ మార్స్అనే పేరుతో రాసిన పుస్తకంలో అంగారకుడిపై కాలువలు ఉన్న విషయాన్ని రాశాడు. అయితే ఆ తరువాత కాలంలో ఇది అవాస్తవంగా రుజువైంది. తక్కువ నాణ్యత ఉన్న టెలిస్కోప్‌ల కారణంగా ఆనాటి శాస్త్రవేత్తలు అంగారకుడిలోని ఆకారాలను రకరకాలుగా అర్థం చేసుకున్నారు. దర్పణభ్రమకు గురయ్యారు.
‘‘అంగారక గ్రహానికి ప్రత్యేకత ఉంది. అది ఎప్పటికప్పుడు మన భూమిని గుర్తుకు తెస్తుంది. ఏదో ఒక రోజు మనం అక్కడికి వెళ్లే వాళ్లమే’’ అన్నారు నాసా శాస్త్రవేత్త జిమ్ గార్విన్. మన భూమికి పొరుగు గ్రహమైన అంగారకుడితో ఒకప్పుడు మనకు బీరకాయపీచు బంధుత్వం ఉండేది. ఆ తరువాత అది దూరపు బంధుత్వంగా మారింది. ఇప్పుడు మాత్రం అంగారకుడితో మనకు దగ్గరి చుట్టరికం. చుట్టపు చూపుగా రేపో మాపో మనం అక్కడికి వెళ్లొచ్చు. సీతకోక చిలకతో చెలిమి చేయవచ్చు. గాంధీతాతతో మాట్లాడవచ్చు! అక్కడ సుసంపన్నమైన నాగరిత వెలిగి ఉంటే ఆ వెలుగు జాడలు వెదికి చూడవచ్చు. వేచి చూద్దాం! - యాకూబ్ పాషా
ఆర్థర్ సి. క్లార్క్ రాసిన తొలి సైన్స్ ఫిక్షన్ నవల ది సాండ్స్ ఆఫ్ మార్స్’. 1951లో ప్రచురించబడిన ఈ నవల మంచి ఆదరణ పొందింది. మార్టిన్ గిబ్బన్ అనే సుప్రసిద్ధ సైన్స్ ఫిక్షన్ రచయిత అంగారక యాత్ర చేస్తాడు. అంగారక గ్రహం ప్రధానాధికారిని కలుస్తాడు. ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు. అంగారకుడిపై కంగారులను పోలిన జీవులను చూస్తాడు. అక్కడ మొక్కలను పెంచుతారనే విషయాన్ని తెలుసుకుంటాడు...ఇలా అంగారకుడికి సంబంధించి చిత్రవిచిత్ర విషయాలన్నీ ఈ నవలలో ఉన్నాయి. అంగారకుడిపై నీటి కాలువలు ఉన్నాయనే ఊహ ఆధారంగా క్లార్క్ ఈ నవల రచించాడు.


No comments:

Post a Comment