Tuesday, December 4, 2012

మరో భూమి కోసం మానవ అన్వేషణ



ఆ మధ్య 'అవతార్‌' అని ఒక సినిమా వచ్చింది. అందులో ఆకట్టుకునే అంశం ఒకటుంది. అదేమంటే 'పండోరా' అనే గ్రహం మీద కూడా (భూమి కాకుండా) మన వంటి జీవజాలం వుండడం. సినిమా కల్పనే కావచ్చు. జీవాలు ఉన్న గ్రహం అనేది ఊహ నుండి పుట్టిన సృజనే కావచ్చు. కానీ ఆధారం లేకుండా అటువంటి ఆలోచనలు ఆవిర్భవించవు కాబోలు. మనలో అంతర్గతంగా పాతుకుపోయిన 'గ్రహాంతర జీవం' అనే అంశం అభివృద్ధి చెంది ఆ విధంగా రచనల్లో, సినిమాల్లో బయటికి వస్తోంది కాబోలు. కానీ ఇకపై ఈ 'కాబోలు' కబుర్లు కట్టిపెట్టవచ్చు. భూమి వంటి గ్రహాలు ఇంకా అంతరిక్షంలో వున్నాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఇహనో.. ఇప్పుడో... వాటిపై జీవం ఉందో లేదో కూడా తెలిసిపోతుంది.
ఎందుకో తెలియదు కానీ మనిషికి మొదటినుండి అంతరిక్షంపై అవ్యాజమైన ప్రేమ. అంతరిక్షంలో తిరిగే గ్రహాలను తన జీవిత గమనానికి ముడిపెట్టుకున్నాడు. కొన్ని గ్రహాలను దేవుళ్లుగా, దేవతలుగా చేసుకున్నాడు. సూర్యుణ్ణి భగవానుడు అన్నాడు. మరణించిన కొందరు మానవులను నక్షత్రాలుగా చేసేశాడు. శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత గ్రహాలూ మామూలు భౌతిక పదార్థాలే అని తెలిసింది. చంద్రునిపై కాలు పెట్టి అక్కడి మన్నూ, రాళ్లూ తెచ్చి చంద్రుడు 'మామ' కాడు, పిలిస్తే రాడు అని తేల్చి పారేసింది. రోవర్ల సాయంతో అంగారకుని ఉపరితలాన్ని భూమి మీద నుండే అధ్యయనం చేసింది. సౌరకుటుంబంలోని గ్రహాల విశేషాలను, వివరాలను దాదాపు తెలుసుకుంది. అయితే ఇదంతా మన సౌరకుటుంబం పరిధికే పరిమితమైంది. ఈ విశ్వంలో మనం కాక మరొక జీవ ప్రపంచం ఉందేమో అన్న అనుమానం మనిషిని వదలలేదు. అందుకు తగ్గట్టు గ్రహాంతర వాసుల కోసం అన్వేషణ ఆరంభమైంది. ఈ క్రమంలో 'అదిగో పులి అంటే ఇదిగో తోక' అన్నట్టు ఎన్నో పుకార్లు. ఒకవేళ గ్రహాంతర వాసులు వుంటే గింటే ఎలా ఉంటారో అని సృజనాత్మకత చూపిన వారు కొందరైతే, అచ్చంగా అటువంటి వారినే చూశామని చెప్పిన వారు కొందరు. ఒక పక్క అటువంటి 'గ్రహాంతర జీవాన్వేషకులు' తమ విధిలో నిమగమై ఉంటే, అసలు విశ్వంలో ఇతర సౌర కుటుంబాలు ఎన్ని వున్నాయి? వాటిలో జీవానుకూలమైన గ్రహాలూ ఏమైనా ఉన్నాయా? అన్న వెదుకులాటలో కొందరున్నారు. ఈ అన్వేషణలో వెలికి వచ్చే ఫలితాలు మనకి (మనిషికి) మేలు చేస్తాయో లేదో తెలీదు కానీ, ఏదో కొత్త విషయం మాత్రం తెలియొచ్చు. అంతరిక్షం అనంతమైందన్న అవగాహన మనకు వుంది. అటువంటి అంతరిక్షాన్ని అన్వేషించడమూ అనంతంగా సాగుతూనే వుంది. ఆ అన్వేషణ ఎందుకోసం అంటే... మన గ్రహము, సౌర కుటుంబము, అసలు విశ్వపు తాలూకు పూర్వాపరాలను తెలుసుకోవడం కోసం అనే చెప్పాలి. ఆ క్రమంలో ఎన్నో వింతలు, అద్భుతాలు, ఆశ్చర్యపరిచే విషయాలూ వెలికి వచ్చాయి. ఇంకా వస్తున్నాయి.
మనకు అతి సమీప నక్షత్రమైన సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలలాగే లక్ష లక్షల నక్షత్రాల చుట్టూ కూడా గ్రహాలు ఉండి ఉంటాయని అనుకునేవారం. కానీ 1995లో మరొక నక్షత్రం చుట్టూ పరిభ్రమించే గ్రహాన్ని తొలిసారి గుర్తించడంతో పరిస్థితి మారిపోయింది. ఇక అప్పటి నుండి సౌర కుటుంబానికావల 708 గ్రహాలను కనుగొని, వాటిని నిర్థారించి, శాస్త్రీయ పట్టిక రూపొందించడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తైతే, పని చేయడం మొదలు పెట్టిన పదహారు మాసాలకే కెప్లర్‌ టెలిస్కోప్‌ 2,326 గ్రహాల వంటి వాటిని కొనుగొంది. అయితే వాటిలో 31ని మాత్రమే నిజమైన గ్రహాలుగా పరిగణించారు.
ఇటీవల భూమి వంటి మరో గ్రహాన్ని అంతరిక్ష పరిశోధకులు గుర్తించారు. ఆ భూమి వంటి గ్రహం భూమి వంటి పరిమాణం కలిగి, ఒక సూర్యుని వంటి నక్షత్రం చుట్టూ భూమిలాంటి దూరంలోనే పరిభ్రమిస్తోంది. అంతేకాదు, దానిపై భూమి వంటి ఉష్ణ్రోగ్రతే 22 డిగ్రీల సెల్సియస్‌ ఉంది. రెండేళ్ల నుండి అంతరిక్షంలో అన్వేషణ కొనసాగిస్తున్న 'కెప్లర్‌' అనే దూరదర్శిని ఈ భూమి వంటి కొత్త గ్రహాన్ని గుర్తించింది. ఇదొక్కటే కాదు, కెప్లర్‌ ప్రతి మూడు నాలుగు నెలలకీ వందల కొద్దీ 'గ్రహాల' ఆచూకీ కనిపెడుతోంది. ఇంత భారీ స్థాయిలో గ్రహాల ఉనికి దొరుకుతుంటే గ్రహాల వేటగాళ్లలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. అతి తొందరలోనే భూమి వంటి గ్రహం కంట పడుతుందన్న నమ్మకంతో వారున్నారు. ఆ మధ్య అంగారక గ్రహంపై నీటి ఆనవాళ్లు దొరికాయనీ, మన ఉపగ్రహమైన చంద్రుడిమీద కూడా జలం వుండేదనడానికి గుర్తులూ లభించాయని సంతోషించారు. ఈ విశాల అనంత విశ్వంలో ఎక్కడో ఒక చోటైనా జీవం తాలూకు జాడలు ఉండి ఉంటాయని, ఆ మాటకొస్తే జీవులే ఉండి ఉంటాయనీ మన విశ్వాసం. ఇటీవలి కాలంలో బయల్పడుతున్న ఇతర 'ఆవాస యోగ్య గ్రహాల' ఆచూకీ మన విశ్వాసాన్ని మరింత పెంచుతోంది.
మరో భూమి!
కెప్లర్‌ టెలిస్కోప్‌ కనిపెట్టిన నూతన గ్రహం పేరు కెప్లర్‌ 22బి. ఈ గ్రహం సూర్యుని వంటి నక్షత్రం చుట్టూ తిరిగే తొలి 'ఆవాస యోగ్య' గ్రహం. అంటే మన భూమిలాగే అక్కడ కూడా ప్రాణికోటి నివసించగలదన్నమాట ఇంతకు ముందు కనిపెట్టిన గ్లీస్‌581డి, హెచ్‌డి85512బిజి గ్రహాలు కూడా ఆవాస యోగ్య పరిధి లోనే ఉన్నాయి. కానీ అవి కాస్త చిన్న, తక్కువ ఉష్ణోగ్రత గల నక్షత్రాల చుట్టూ తిరుగుతున్నాయి.
కెప్లర్‌ 22బి భూమి కంటే 2.4 రెట్లు పెద్దది, మనకు 600 కాంతి సంవత్సరాల దూరాన ఉంది. అది ఒకసారి తన సూర్యుడి(నక్షత్రం)ని చుట్టి రావడానికి 290 రోజులు తీసుకుంటుంది. అంటే అక్కడి సంవత్సరం మన సంవత్సరం కంటే చిన్నది. ఆ గ్రహ వాతావరణం వెచ్చగా, జీవాభివృద్ధికి అనుకూలంగా ఉన్నట్లు తెలిసినా, దాని ఉపరితలం ఘనరూపంలో ఉందో లేక జల, వాయు రూపంలో ఉందో తెలియదు. కానీ కొందరు మాత్రం ఈ విశ్వంలో మనం ఏకాకులం కాదంటున్నారు. అంటే భూమిలాంటి గ్రహాలు మరికొన్ని వున్నాయంటున్నారన్నమాట. ఈ కొత్త గ్రహంపై నీరు ద్రవ రూపంలో ఉండడమే కాకుండా, అది సముద్రాల రూపంలో ఉండొచ్చని అంటున్నారు. ఇంకొంతమంది ఇంకాస్త ముందుకెళ్లి అక్కడ ఆల్రెడీ ప్రాణులు ఉన్నాయంటున్నారు. అంతరిక్ష పరిశోధక సంస్థ నాసా ప్రకారం ఈ గ్రహం ప్రాణులు నివసించడానికి వీలుగా ఉంది. కానీ దీని గురించి సంపూర్ణ సమాచారం లభించడానికి దశాబ్దాలో, శతాబ్దాలో పట్టొచ్చు. మరి ఆరు వందల కాంతి సంవత్సరాలకు ఆవల ఉన్న గ్రహం గురించి తెలుసుకోవడం అంత సులభం కాదు కదా. కొన్ని వందల కిలోమీటర్ల దూరాన ఉన్న చంద్రుడి గురించి వివరాలు సేకరించడానికి, దానిపై కాలు మోపడానికే మనకు డెభ్బై ఏళ్ల సమయం పట్టింది.
మనకి ఆరువందల కాంతి సంవత్సరాల దూరమంటే ఊహించుకోవడం కష్టమే. ఒక కాంతి సంవత్సరం మన కిలోమీటర్ల లెక్కలో పది ట్రిలియన్ల కిలోమీటర్ల దూరం. ట్రిలియన్‌ అంటే 1000000000000 (ఒకటి పక్కన పన్నెండు సున్నాలు). మైళ్ల లెక్కలో అయితే 3,526,800,000,000,000 మైళ్లు. చాలా దూరమే! గంటకు 22,315 మైళ్ల వేగంతో ప్రయాణిస్తే, ఆ గ్రహాన్ని చేరడానికి సుమారు ఇరవై మిలియన్‌ సంవత్సరాల కాలం అవసరం!! అంత దూరాన జీవం ఉంటే ఏం, లేకపోతే ఏం. అయితే చాలామంది ఈ కొత్త గ్రహాన్ని కనిపెట్టడంపై ఆనందోత్సాహాలు వ్యక్తపరుస్తున్నారు. ఇంత అన్వేషణ తర్వాత ఏంటి అనేది ప్రశ్న. ఒకవేళ నివాస యోగ్యమైన గ్రహం గానీ గుర్తించబడితే మనం అక్కడికి వెళ్లి డేరా వేయొచ్చా? అనడిగితే కుదరదంటున్నారు శాస్త్రజ్ఞులు. పైగా అసలు కెప్లర్‌ 22బి పైన ఇప్పటికే జీవులు ఉండొచ్చేమో అన్న అనుమానం ఉంది. మనకు అతి దగ్గరగా ఉన్న నక్షత్రం నాలుగు కాంతి సంవత్సరాల దూరాన ఉంది. ఇప్పటికి అందుబాటులో వున్న అత్యంత వేగవంతమైన రాకెట్ల సహాయంతో దానికి చేరువగా వెళ్లడానికే కొన్ని వేల సంవత్సరాల కాలం పడుతుంది. భూమి వంటి గ్రహాన్ని గుర్తించడం ఒక దశ. ఆ గ్రహం నుండి వెలువడే కాంతిని నేరుగా విశ్లేషించడం తర్వాతి దశ. దీనిద్వారా అక్కడి వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని రాబట్టవచ్చు. అప్పటి వరకూ అసలు ఆ గ్రహంపై జీవం ఉందో లేదో తెలిసే అవకాశమే లేదు.
కెప్లర్‌ ఘనత
ఖగోళ శాస్త్రంలో గొప్ప పేరు తెచ్చుకున్న జోహాన్నెస్‌ కెప్లర్‌ డిసెంబర్‌ 27, 1571న జన్మించాడు. పాతికేళ్లకే అతను 'మిస్టీరియం కాస్మోగాఫికం' అనే గ్రంథం రచించాడు. అందులో తనను ప్రభావితం చేసిన కోపర్నికస్‌ ప్రతిపాదనలను సమర్థించాడు. పైగా ఎన్నో రంగాలలో తన మేథను చూపాడు. మరెన్నో రంగాలలో ఆద్యుడిగా నిలిచాడు. అందులో కొన్ని...
* గ్రహాల కదలికలను తొలిసారిగా కచ్చితంగా వివరించాడు. తత్ఫలితంగా కొన్ని సూత్రాలను ప్రతిపాదించాడు.
* దీర్ఘ దృష్టి, హ్రస్వ దృష్టి కొరకు కంటి అద్దాల నమూనా రూపొందించాడు.
* రెండు కళ్ల వల్ల దృష్టి ఎలా ఉంటుందనేది వివరించాడు.
* తన గ్రంథం 'డయాప్త్రిసిస్‌'లో టెలిస్కోప్‌ ఎలా పనిచేస్తుందో వివరించాడు.
* చంద్రుడి వల్ల ఆటుపోట్లు ఎలా కలుగుతాయో ముందుగా వివరించాడు. గెలీలియో దాన్నే నిరూపించాడు.
* సూర్యుడు ఒక అక్షంపై తిరుగుతాడని చెప్పాడు.
* క్రీస్తు జన్మదినం లెక్కగట్టి ప్రతిపాదించాడు. ఇప్పుడు అదే తేదీని ప్రపంచమంతా పాటిస్తోంది.

* 'శాటిలైట్‌' అనే పదాన్ని పుట్టించాడు.అనంత విశ్వంలో అన్వేషణ

గ్రహాలను ఎలా గుర్తిస్తారు?
విశ్వాంతరాళం లోని రహస్యాలను కనిపెట్టడం ఒకప్పుడు ఊహకు కూడా అందనిది. అయితే, ఈ రోజు సాంకేతిక విజ్ఞానం మనిషికి ఎంత సాయపడుతుందో ఊహకి అందడం లేదు. అత్యంత వేగంగా ప్రయాణిస్తేనే గమ్యం చేరడానికి వేల, లక్షల ఏళ్లు పట్టేంత దూరాన ఉన్న ఖగోళ పదార్థాలను గుర్తించడం అసంభవం అనుకోవడం నుండి 'ఇదిగో చూడండి, కనిపెట్టాం' అనే స్థాయికి చేరుకున్నాం. గ్రహాలు సూర్యుని వంటి నక్షత్రాల చుట్టూ పరిభ్రమిస్తాయని మనకు తెలుసు. నక్షత్రాల నుండి కాంతి వెలువడుతుందనీ తెలుసు. ఒక కాంతి జనకం ముందు ఏదైనా పదార్థం ప్రయాణించినప్పుడు ఆ కాంతిలో కాస్త మార్పు (తగ్గుదల) వస్తుందని తెలుసు. ఇదే జ్ఞానంతో ఇప్పుడు ఖగోళ మండలంలో గ్రహాలను వెతుకుతున్నారు.
కెప్లర్‌ దూరదర్శిని. కొన్నికోట్ల కిలోమీటర్ల దూరాన ఉన్న నక్షత్ర మండలాలను గుర్తించడానికి రూపొందించబడింది. కెప్లర్‌ని నాసా మార్చ్‌6, 2009న అంతరిక్షంలోకి పంపింది. మన పాలపుంతను వడగడుతూ, అందులోని కోట్లాది నక్షత్రాల చుట్టూ తిరుగుతూ, జీవులకు అనువైన గ్రహాలను కనిపెట్టడమే కెప్లర్‌ విధి. మూడున్నర సంవత్సరాల కాల పరిధిలో అది తన విధి నిర్వహించాలి. కెప్లర్‌లో గొప్ప పరికరాలు కూడా ఏమీ లేవు. కేవలం అతి సున్నితమైన ఫొటోమీటర్‌, కొన్ని సెన్సార్లు ఉంటాయి. దానికి కావలసిన శక్తిని సోలార్‌ పానెళ్ల ద్వారా సూర్యుని నుండి గ్రహిస్తుంది. తన మూడున్నర సంవత్సరాల కాలంలో కెప్లర్‌ సుమారు లక్ష నక్షత్రాల ప్రకాశ మార్పులను పసిగడుతుంది. ఒక నక్షత్రం ముందు నుండి ఒక గ్రహం ప్రయాణిస్తే, ఆ నక్షత్ర కాంతిలో కొంత మార్పు వస్తుంది. కెప్లర్‌ అటువంటి మార్పులను చక్కగా గుర్తించగలదు. ఆ మార్పు రెండు నుండి పదహారు గంటల వరకూ ఉండొచ్చు. ఒకవేళ ఆ మార్పు కచ్చితమైన కాలానుగుణంగా ఉంటే అది ఒక గ్రహం అని నిర్థారిస్తారు. పైగా అటువంటి మార్పు అదే మోతాదులో, అదే కాలానుగుణంగా పదే పదే జరిగితేనే ఆ గ్రహ ఉనికిని నిజమైనదిగా గుర్తిస్తారు. ఒకసారి గ్రహ నిర్థారణ జరిగాక, దాని పరిభ్రమణ పరిధిని లెక్కగడతారు. తన నక్షత్రం చుట్టూ ఒకసారి తిరగడానికి ఆ గ్రహం తీసుకునే సమయాన్ని ఇందుకు ఉపయోగిస్తారు. అలాగే ఆ గ్రహం దాటినప్పుడు తగ్గిన నక్షత్ర కాంతిని బట్టి ఆ గ్రహం పరిమాణాన్ని లెక్క గడతారు.
అయితే ఇదంతా చెప్పినంత సులభం కాదు. ఒక భారీ నక్షత్రం ముందు నుండి ఒక గ్రహం వెళ్లినప్పుడు ఆ నక్షత్ర కాంతిలో కలిగే మార్పు కారు హెడ్‌ లైట్ల ముందు నుండి ఒక దోమ వెళ్తే కలిగే మార్పులా ఉంటుంది. మరి అంత సూక్ష్మ మార్పుని పసిగట్టడమంటే సవాలే. ఇక భూమి వంటి గ్రహాన్ని గుర్తించడమంటే ఆ హెడ్‌ లైట్ల ముందు దోమ ఆనవాలు పట్టడమే. అటువంటి సవాలుని కెప్లర్‌ సమర్ధవంతంగా ఎదుర్కొని పని చేస్తోంది.
పేరు ఎలా పెడతారు?
కొత్తగా కనిపెట్టిన గ్రహాలకు పేర్లెలా పెడతారు? అన్న అనుమానం వస్తుంది. ఉదాహరణకు ఇటీవల కనిపెట్టిన మన భూమి వంటి గ్రహాన్ని కెప్లర్‌ 22బి అని పిలుస్తున్నారు. కాల్పనిక ప్రపంచంలో (పుస్తకాలు, సినిమాలు) అటువంటి గ్రహాలకు కాస్త అందమైన పేర్లు కూడా ఉన్నాయి. పండోరా(అవతార్‌ చిత్రంలో), ఎండోర్‌, అరకిస్‌ వంటివి. కానీ వాస్తవిక ప్రపంచంలో మనకి గ్లీస్‌ 581డి, హెచ్‌డి85512, కెప్లర్‌ 22బి వంటి పొడి పేర్లు ఉన్నాయి. నిజానికి కనిపెట్టిన ప్రతి గ్రహానికీ మంచిపేర్లు పెట్టాలని ఒక ప్రతిపాదన వచ్చింది. బహుశా ఏ గ్రీకు, రోమన్‌ పేరులో పెట్టమని వుండవచ్చు. కానీ ఆ ప్రతిపాదనను ఎవరూ అంతగా పట్టించుకోలేదు. పైగా దానివల్ల అసలు ప్రక్రియ నెమ్మదౌతుందని ఒక అనుమానం. ఎందుకంటే పేరు పెట్టడానికి ముందుగా ఒక అంతర్జాతీయ అవగాహన కావాలి. అందుకు సమయం పట్టవచ్చు. ఇక్కడ కొత్త గ్రహాలేమో దాదాపు రోజుకొకటి చొప్పున వెలికి వస్తున్నాయి! (2010లో 385 కొత్త గ్రహాలను కనిపెట్టారు). ప్రస్తుతం కొత్త గ్రహాలకు పేర్లు పెట్టే పద్ధతి సులభంగానే వుంది. ఒక గ్రహాన్ని కంటితో చూడగలుగుతున్నామంటే దానికి ఒక పేరు ఉండి తీరుతుంది. టెలిస్కోప్‌ ద్వారా కనిపెడితే దానికి ఒక ప్రత్యేక స్థాయి (స్టేటస్‌) ఇస్తారు. బహుళ నక్షత్ర వ్యవస్థలో కనిపెట్టిన ఒక్కో నక్షత్రానికి సిరియస్‌ బి, సిరియస్‌ బి అని పేర్లు పెడతారు. వాటి చుట్టూ ఉన్న గ్రహాలకు చిన్న అక్షరాలను జోడిస్తారు.
ప్రస్తుతం ఇప్పటి వరకూ తెలియని, పేరు పెట్టని గ్రహాలను అన్వేషిస్తున్నారు. 'కెప్లర్‌' అనే అంతరిక్ష టెలిస్కోప్‌ కొత్త నక్షత్ర కూటములను పరిశీలిస్తోంది. ఆ కూటమిలో కనిపెట్టబడిన ప్రతి నక్షత్రానికి కెప్లర్‌ అనే పేరు ఉంటుంది. కెప్లర్‌ 22 అంటే అది ఆ కూటమిలో ఇరవై రెండవ నక్షత్రం అని అర్ధం. ఇక ఆ నక్షత్రం చుట్టూ తిరిగే గ్రహానికి చిన్న ఆంగ్ల అక్షరం ఉంటుంది. అలా ఇప్పుడు కనిపెట్టబడిన గ్రహం పేరు కెప్లర్‌ 22బి అయ్యింది. (గ్రహం పేరులో ఎప్పుడూ ''ఎ'' పెట్టరు). కెప్లర్‌ గుర్తించిన పదకొండవ నక్షత్ర కూటమి కెప్లర్‌ 11. అందులో ఆరు గ్రహాలు ఉన్నాయి. అంటే వాటి పేర్లు బి నుండి జి వరకు ఉంటాయి. 11బి, 11సి, 11డి... ఇలా. అలాగే వాస్ప్‌ (షaరజూ), కారట్‌ (షశీతీశ్‌ీ) అనే టెలిస్కోప్‌లు కనిపెట్టిన గ్రహాల పేర్లు ఆ టెలిస్కోపుల పేర్లతోనే మొదలౌతాయి.
అయితే అన్ని ఖగోళ పరిశీలనలకూ ఇటుంటి పేర్లు ఉండవు. అంగారక గ్రహం గుర్తించిన లోయలకు భూమిపైన లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణాల పేర్లు పెట్టాలని నాసా నిర్ణయించింది. ఫలితంగా అంగారక గ్రహం ఉత్తరార్థం లోని ఒక లోయకు స్కాట్లాండ్‌ లో ఉన్న 'బాల్వికార్‌' అనే పట్టణం పేరు, దక్షిణార్థంలోని ఒక దానికి 'బ్రిస్టల్‌' అనే పేరు వచ్చాయి. అయితే అసంఖ్యాకంగా ఉండే నక్షత్రాలకు ఆ విధమైన నామకరణం సాధ్యం కాదు. ఏదేమైనా 'కెప్లర్‌' అన్న పేరు కూడా అంత తక్కువదేమీ కాదు. కెప్లర్‌ అనేది పదహారవ శతాబ్దపు జర్మన్‌ ఖగోళ శాస్త్రవేత్త పేరు. ఆయన ఆషామాషీ మనిషి కాడు. సూర్యుడి చుట్టూ గ్రహాలు ఎలా పరిభ్రమిస్తున్నాయో వివరించాడు. దాని ఆధారంగా తరువాత న్కూటన్‌ గ్రహాలు ఆ విధంగా ఎందుకు పరిభ్రమిస్తాయో వివరించాడు.
ఇకపోతే శాస్త్రీయ పరిశోధనకు కొన్ని సమస్యలున్నాయి. మనకు తెలియని విషయాలను తెలియజేయడం వరకూ బానే ఉంది గానీ బోలెడు డబ్బు, సమయం వెచ్చించి వెలికి తీసిన విషయాలు మానవ జీవనానికి ఏ విధంగా ఉపయోగపడతాయన్న ప్రశ్న కొందరిని వేధిస్తుంది. సరే భూమి వంటి గ్రహం ఇంకొకటి కాకపోతే ఇంకో కోటి ఉండొచ్చు. వాటిమీద మనలాంటి వారూ, కాకపోతే ఇంకోలాంటి వారూ ఉండొచ్చు. అయితే ప్రస్తుతం మనకి అందువల్ల ఒనగూడే లాభం గానీ నష్టం గానీ ఏమిటి? చంద్రునిపై ఏముందో తెలుసుకుని ఏం చేశాం? అంగారకుడిపై ఒకప్పుడు నీరు ఉండి నేడు ఆవిరైపోయి ఉంటే ఏం చేస్తాం అంటారు వీళ్లు. అయితే శాస్త్రవిజ్ఞానరంగంలో ప్రతి మైలురాయికీ ఇంటువంటి దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. స్వంతానికి కోట్లు సంపాదించుకునే స్పోర్ట్స్‌మెన్‌ వల్లా, ఆ క్రీడల వల్లా, కోట్లలో చేసే సినిమా వ్యాపారం వల్లా సామాన్య మానవుడికి ఒరిగింది ఏమీలేదు. ఇటువంటి వాటికంటే శాస్త్రపరంగా ఎదగడం, విస్తరించడం, వివరించడం, విజ్ఞానాన్ని పంచడం మంచిదే కదా. మనందరం వెళ్లి కెప్లర్‌ 22బి పైన ప్లాట్లు కట్టేదీ లేదు. అక్కడ ఎవరైనా వుంటే వారు వచ్చి భూమిపై ప్లాట్లు కొనేదీ లేదు. కానీ శాస్త్ర పరిశోధన విశ్వ రహస్య వివరాలను మన ముందు విప్పి ఆరబోస్తోంటే ఆనందించడానికి అడ్డేముంది?

1 comment: