Showing posts with label అంతరిక్షం. Show all posts
Showing posts with label అంతరిక్షం. Show all posts

Saturday, January 5, 2013

సూర్య గ్రహణం అంటే ఏమిటి ?


భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు, భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనబడకుండా పోవడం వలన సూర్య గ్రహణము ఏర్పడుతుంది. సూర్య గ్రహణము అమావాస్య నాడు మాత్రమే వస్తుంది. ప్రాచీన కాలంలో గ్రహణాలను అశుభ సూచకముగా భావించేవారు. ఇప్పటికీ ప్రపంచంలో కొన్ని ప్రాంతాల ప్రజలు వీటిని అశుభ సూచకంగానే భావిస్తారు. అకస్మాత్తుగా సూర్యుడు ఆకాశం నుండి మాయమై చీకటి కమ్ముకోవడం వలన ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతారు. విజ్ఞాన శాస్త్రం గ్రహణాలను వివరించిన తరువాత ప్రజల్లో ఇటువంటి నమ్మకాలు తగ్గాయి.


భూమిని చంద్రుడి పూర్ణ ఛాయ (అంబ్రా) కప్పినపుడు మాత్రమే సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడుతుంది. అందుచేత సంపూర్ణ సూర్య గ్రహణాలు, భూమ్మీద ఎక్కడైనా సరే, చాలా అరుదు. సంపూర్ణ సూర్య గ్రహణం చూడదలచినవారు ఆ గ్రహణం పట్టే ప్రదేశాలు సుదూరంలో ఉన్నప్పటికీ అక్కడకు వెళ్ళి ఆ గ్రహణాన్ని చూస్తారు. 1999 లో ఐరోపా లో కనిపించిన సూర్యగ్రహణమును ప్రపంచంలో అత్యధిక ప్రజలు వీక్షించారని చెబుతారు. దీనివలన గ్రహణాల పట్ల ప్రజలకు అవగాహన పెరిగింది. తరువాతి గ్రహణాలు 2005, 2006లలోను, 2007 సెప్టెంబర్ 11 న వచ్చాయి. తరువాతి సంపూర్ణ సూర్యగ్రహణము 2008 ఆగష్టు 1 న వచ్చింది .

సూర్య గ్రహణాలు నాలుగు రకాలు.
·           సంపూర్ణ సూర్య గ్రహణం: చంద్రుడు సూర్యుడిని పూర్తిగ కప్పివేయడం వల్ల ఇది జరుగుతుంది. అత్యంత ప్రకాశ వంతమైన గోళం వలే కనిపించే సూర్యుడు చంద్రుడి ఛాయ వల్ల ఒక సన్నటి అంచు వలే కనిపిస్తాడు. ఏదైన సమయంలొ సంపూర్ణ సూర్య గ్రహణం భూమి మీద ఒక ప్రదేశములొ వారికి మాత్రమే కనిపిస్తుంది.
·           అంగుళీయక (యాన్యులర్) సూర్య గ్రహణం: సూర్యుడు చంద్రుడూ ఒకే కక్ష్య లోకి వస్తారు. కాని సూర్యుని కంటే చంద్రుని పరిమాణము చిన్నదిగా ఉండడం వలన, చంద్రుని చుట్టూ సూర్యుడు ఒక ప్రకాశవంతమైన ఒక ఉంగరం వలే కనిపిస్తాడు.
·            సంకర గ్రహణం: ఇది సంపూర్ణ మరియు అంగుళీయక సూర్య గ్రహణాలకు మధ్యస్తంగా ఉంటుంది. ఈ సంకర గ్రహణము భూమిపై కొన్ని ప్రదేశాలలో సంపూర్ణ గ్రహణంగా, మరి కొన్ని ప్రదేశాలలో పాక్షికంగాను కనిపిస్తుంది. సంకర గ్రహాణాలు అరుదు.
·             పాక్షిక సూర్య గ్రహణం: సూర్యచంద్రులు ఒకే కక్ష్యలో ఉండరు. చంద్రుడు సూర్యుడిని పాక్షికంగానే అడ్డుకుంటాడు. అప్పుడూ ఏర్పడే గ్రహణాన్ని పాక్షిక సూర్య గ్రహణం అని అంటారు. పాక్షిక గ్రహణం భూమి మీద చాలా భాగాలనుండి కనిపిస్తుంది.
        సూర్య గ్రహణం నాటి సూర్య, చంద్ర, భూ స్థితులు ఎలా ఉంటాయో పైన ఉన్న బొమ్మలో చూడవచ్చు. ముదురు బూడిద రంగుతో ఉన్న భాగాన్ని పూర్ణ ఛాయ (అంబ్రా) అని పిలుస్తారు. లేత బూడిద రంగులో ఉన్న భాగాన్నిఉప ఛాయ (పెనంబ్రా) అని పిలుస్తారు. ముదురు బూడిద రంగు భాగంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. లేత బూడిద రంగు ప్రాంతంలో పాక్షిక సూర్యగ్రహణము కనిపిస్తుంది. భూని చుట్టూ ఉండే చంద్రుని కక్ష్య, సూర్యుడి చుట్టూ తిరిగే భూమి కక్ష్యా తలానికి 5 డిగ్రీల కంటే కొద్దిగా ఎక్కువ కోణంలో వంగి ఉంటుంది. దీని వలన అమావాస్య నాడు చంద్రుడు సూర్యుడికి పైనో క్రిందో ఉంటాడు. అమావాస్య నాడు, చంద్రుడు చంద్ర కక్ష్య, భూకక్ష్య ఖండించుకునే బిందువులకు దగ్గరగా ఉన్నపుడు మాత్రమే సూర్య గ్రహణము ఏర్పడుతుంది.


Friday, January 4, 2013

సూపర్ ఎర్త్ గురించి తెలుసుకుందామా....



ఈ అనంత విశ్వంలో వేరెక్కడైనా జీవరాశి ఉందేమోనని తెలుసుకునేందుకు సైన్సు పరిశోధనా చరిత్రలోకెల్లా అతి విస్తృతానే్వషణ కార్యక్రమం జరుగుతోంది. అత్యాధునిక కంప్యూటర్ విజ్ఞానాన్ని ఉపయోగించుకుని ‘నాసా’ (అమెరికా వ్యోమ, వైమానిక సంస్థ) ఈ పథకాన్ని నిర్వహిస్తోంది.
1960లో రష్యాలో ఎద్దు పుర్రె ఒకటి దొరికింది. దానిని ప్రయోగశాలలో విశే్లషించి చూస్తే ఆ ఎద్దు బతికి ఉండగా నాలుగు వేల సంవత్సరాల క్రితం కొట్టిన తుపాకీ గుండు వల్ల పుర్రెకు రంధ్రం పడినట్లు తెలుసుకున్నారు. అన్ని వేల సంవత్సరాల క్రితం తుపాకీ గుండు ఎక్కడిది?
అమెరికాలోని నవాడా రాష్ట్రంలో దొరికిన ఒక ఇనుప నట్టు కూడా అనేక మిలియన్ల సంవత్సరాలకు పూర్వం తయారు కాబడిందని కనుగొన్నారు. ఒకప్పుడు భూమి మీద గ్రహాంతర వాసులు ఉన్నారని చెప్పడానికి కావలసినన్ని తార్కాణాలు ఉన్నాయని అంటున్నారు.
ఈ భూమిపై మానవుడు అవతరించడానికి ముందు అన్యగ్రహ వాసులు ఈ భూగ్రహానికి యాత్రలు చేస్తూ ఉండేవారని కొంతమంది బల్లగుద్ది మరీ చెప్పేస్తున్నారు. ఈ గ్రహాంతర వాసుల ఉనికిని తెలియజేసే సంకేతాల కోసం మన శాస్తవ్రేత్తలు అహరహం శ్రమిస్తున్నారు.
గ్రహాంతర బుద్ధిజీవుల గురించి నేడు దేశదేశాలా తర్క వితర్కాలు పెద్దఎత్తున సాగుతున్నాయి. ఇంతవరకు సౌర కుటుంబంలోని ఇతర గ్రహాల మీద గాని, వాటి ఉపగ్రహాల మీద గాని జీవరాశి జాడ వున్న ఆధారాలు ఏమీ లభించలేదు.



సూపర్ ఎర్త్
అంతరిక్షంలోని రహస్యాలను తొంగి చూసేందుకు అనేక అంతరిక్ష నౌకలతోపాటు, అంతరిక్ష టెలిస్కోప్‌లు అంతరిక్షంలో నిరంతరం అనే్వషణా కార్యక్రమంలో ఉన్నాయి.
సుదూర ప్రాంతాల్లో ఇతర నక్షత్రాల సమీపంలో జీవరాశి ఉండే అవకాశం గల గ్రహాల అనే్వషణా కార్యక్రమంలో భూమిని పోలిన సూపర్ ఎర్త్‌ను గుర్తించడం జరిగింది.
600 కాంతి సంవత్సరాల దూరంలో ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న సూపర్ ఎర్త్‌ను నాసా తమ కెఫ్లర్ అంతరిక్ష దూరదర్శిని ద్వారా గుర్తించింది. ఇది ఆ నక్షత్రం చుట్టూ మన కాలమానం ప్రకారం 290 రోజులకు ఒకసారి తిరుగుతోంది. ఇది భూమి పరిమాణానికి 2.4 రెట్లు ఉంది. అందుకే దీనిని ‘సూపర్ ఎర్త్’ అనే పేరుతో గుర్తిస్తున్న వాటి జాబితాలో చేర్చారు.
ఈ సూపర్ ఎర్త్ తలం జీవరాశికి నివాసయోగ్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయని, దానికి ఉపరితలం ఉంటే జీవరాశి మనుగడకు కావలసిన ఉష్ణోగ్రత ఉంటుందని నాసా శాస్తవ్రేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఈ గ్రహం ఉపరితలంపై నీరు ద్రవరూపంలో ఉండే అవకాశం ఉందంటున్నారు. అయితే దీని తలం ఘనరూపంలో ఉందా లేదా నెప్ట్యూన్ తలం మాదిరి వాయు రూపంలో ఉందా? అనే విషయంపై అధ్యయనం చేయాల్సి ఉందంటున్నారు నాసా శాస్తవ్రేత్తలు.
ఈ సూపర్ ఎర్త్‌ను కెప్లర్ 22-బి అని నామకరణం చేశారు. దీని ఉపరితలం మీద ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ ఉండవచ్చునని భావిస్తున్నారు. సౌర కుటుంబం వెలుపల ఇంతవరకు గుర్తించిన గ్రహాల్లో ఇదే అనువైన వాతావరణం కల్గి ఉందని నాసా శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు.
తమ అధ్యయనంలో ఈ సూపర్ ఎర్త్‌పై కొంత నేల మరి కొంత నీరు ఉందని తెలిసిందంటున్నారు. సాధారణంగా ఒక గ్రహంపై జీవరాశి ఉండాలంటే అది దాని మాతృతారకు నిర్దేశిత దూరంలో ఉండాలి. అప్పుడే దాని మీద ఉష్ణోగ్రత జీవరాశి మనుగడకు కావలసిన విధంగా ఉంటుంది. తాము గుర్తించిన కెప్లర్ 22-బి ఈ రకమైన పరిస్థితులలోనే ఉందంటున్నారు.
గత చరిత్ర
2011 మే నెలలో కూడా ఫ్రెంచి శాస్తవ్రేత్తలు భూమికి 20 కాంతి సంవత్సరాల దూరంలో గ్లీజర్ 581 డి అనే గ్రహాన్ని గుర్తించారు. ఈ గ్రహం ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశికి ఆరు రెట్లు ఎక్కువగా ఉంది.
2011 ఆగస్టులో స్విట్జర్లాండ్ శాస్తవ్రేత్తలు హెచ్‌డి 85512 బి అనే గ్రహాన్ని గుర్తించారు. ఇదీ సూపర్ ఎర్త్ జాబితాలో ఉంది. భూమి కంటే పరిమాణంలో 3.6 రెట్లు ఎక్కువగా ఉంది.
2005లో యూజినో రివరా శాస్తవ్రేత్త గ్లీజ్ 876 డి అనే సూపర్ ఎర్త్‌ను గుర్తించారు. ఇది భూద్రవ్యరాశికి ఏడున్నర రెట్లు ఎక్కువ ఉంది. ఇది తన మాతృతార చుట్టూ మన కాలమానం ప్రకారం 2 రోజుల్లో తిరుగుతోంది. ఇటువంటి సూపర్ ఎర్త్‌లను ఇంతవరకు 16 గుర్తించారు.
మన సౌర కుటుంబం వెలుపలగల గ్రహాలలో ఇప్పటికి 500 గ్రహాలను ఖగోళ శాస్తవ్రేత్తలు గుర్తించారు. ఈ నిరంతర అనే్వషణలో గ్రహాంతర వాసులు తారసపడితే అదొక అద్భుత పరిణామాలకు దారితీస్తుంది.

Thursday, January 3, 2013

అంగారకుడు గురించి కొన్ని విశేషాలు



మనిషి తెలివైన జీవి అని మనం గర్వంగా చెప్పుకుంటాం. కాని మనిషి కంటే తెలివైన జీవులు అరుణగ్రహం (అంగారకుడు)లో జీవించాయని కొందరు పరిశోధకులు గట్టిగా నమ్ముతున్నారు. అంగారకుడిపై ఆనాడు కనిపించిన మానవ ముఖ రూపం నుంచి నిన్నా మొన్నటి గాంధీజీ ఆకృతి వరకు... కేవలం చిత్రాలు కావని... ఒకనాటి సంపన్న నాగరికతకు చెందిన సూచన ప్రాయమైన గుర్తులని అంటున్నారు. ఆ కథేమిటో తెలుసుకుందాం...
మన చిన్నప్పటి ఆకాశం పెద్ద కాన్వాస్. ప్రతి మేఘం చేయి తిరిగిన చిత్రకారుడి చిత్రమై మనల్ని గిలిగింతలు పెట్టేది. ‘ఆకాశంలో నేను గుర్రాన్ని చూశాను’ అని ఒకరంటే ‘నేను ఏనుగును చూశాను’ అని ఒకరు అనేవారు. మేఘాల్లో కనిపించే ‘చిత్ర’విచిత్రాలు అంగారక గ్రహంలోనూ ఎప్పటి నుంచో కనిపిస్తున్నాయి. తేడా ఏమిటంటే... మేఘాలు మన ఆనందానికి, ఆశ్చర్యానికి  మాత్రమే పరిమితం. కానీ అంగారకగ్రహంలో కనిపించే ప్రతి చిత్రం ఎప్పటికప్పుడు చర్చను రేకెత్తిస్తోంది.
సరికొత్త ప్రతిపాదనలకు కారణమవుతోంది. కొన్ని రోజుల క్రితం ఇటలీ అంతరిక్ష సంస్థ అంగారకగ్రహంపై ఉన్న శిలలపై గాంధీజీ రూపాన్ని గుర్తించినట్లు ప్రకటించింది. ఐరోపా మార్స్ ఆర్బిటర్ తీసిన చిత్రాల్లో గాంధీజీ రూపం స్పష్టంగా ఉంది! అంగారకుడిపై చిత్రాల సందడి నిన్నటి మొన్నటి విషయం కాదు. దీనికి చాలా చరిత్ర ఉంది.
1976లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా )కు చెందిన వైకింగ్-1 స్పేస్‌క్రాఫ్ట్ అంగారకుడి చిత్రాలను భూమి మీదకు పంపింది. ఆ చిత్రాల్లో సైడోనియ అనే ప్రాంతంలో మానవ ముఖ రూపం బయటి పడింది. ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన భౌగోళిక ఆకారం అని కొద్దిమంది అంటే అలా ఏర్పడింది కాదని కొందరన్నారు.
మరికొందరు మాత్రం చాలా ఏళ్ల క్రితమే అంగారకుడిపై తెలివైన నాగరికత వర్థిల్లిందని దాని తాలూకు ఒకానొక ఆనవాలే ‘మానవ ముఖరూపం’ అని చెప్పారు. కొందరైతే రెండు మూడు అడుగులు ముందుకు వేసి ‘అంగారకుడిపై ప్రాచీన నాగరికత తాలూకు అంశాలను దాచి పెట్టే కుట్రను నాసా చేస్తోంది’’ అని ఆరోపించారు.
ఆశ్చర్యకరమైన ఒక విషయం ఏమంటే, వైకింగ్ చిత్రాల కంటే ముందుగానే...1958 సెప్టెంబర్‌లో ‘ది ఫేస్ ఆన్ మార్స్’ పేరుతో కామిక్‌బుక్ వచ్చింది. విలియమ్‌సన్ రాసిన ఈ పుస్తకానికి జాక్ కిర్బె బొమ్మలు గీశాడు. ఈ కథలో అంగారకుడిపై వెళ్లిన అంతర్జాతీయ అంతరిక్షశాస్త్రవేత్తల బృందానికి అక్కడి కొండల్లో చెక్కిన మానవరూపం కనిపిస్తుంది! హైరిజుల్యుషన్ ఉన్న వైకింగ్ చిత్రాలు అందరికీ అందుబాటులో లేక పోవడంతో ఎవరి ఊహలకు అనుగుణంగా వారు వ్యాఖ్యానించుకునే పరిస్థితి ఏర్పడింది.
కొందరైతే అంగారక గ్రహంపై కనిపించిన మానవ ముఖంపై పుస్తకాలు రాసి హాట్ హాట్‌గా అమ్ముకున్నారు కూడా. ‘అంగారకుడిపై మానవ ముఖం’ అనే అంశం పుణ్యామా అని ఆరోజుల్లో మిగిలిన గ్రహాల కంటే అంగారకుడిపై ఆసక్తి పెరగడానికి కారణమైంది. అంగారకుడిపై హాలివుడ్‌లో సినిమాలు ప్రారంభమయ్యాయి. పత్రికల్లో, రేడియోల్లో వేడి వేడి చర్చ మొదలైంది.
‘స్పష్టాస్పష్టంగా కనిపించే రూపాలను ఆధారంగా చేసుకుని ఊహలు అల్లడం అనైతికం’ అని హేతువాదులు వేడివేడిగా వాదనకు దిగే రోజుల్లో ఒక చిత్రం జరిగింది. ‘అంగారకుడిపై ఏదో ఉంది’ అని వాదించేవాళ్లకు అదొక అదృష్టంగా పరిణమించింది. 1998లో నాసాకు చెందిన మార్స్ గ్లోబల్ సర్వేయర్ స్పేస్‌క్రాఫ్ట్ అతి దగ్లర్లో నుంచి తీసిన అంగారకుడి చిత్రాలను భూమి మీదికి పంపింది. వైకింగ్ చిత్రాల కంటే ఇవి ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్నాయి. మానవ ముఖరూపం, కళ్లు, పెదాలు, ముక్కు... కొంత స్పష్టంగా గుర్తించడానికి వీలైంది.
మార్స్ ఆర్బిటర్ కెమెరా (ఎంఒసి) చిత్రించిన చిత్రాల ద్వారా అంగారకుడిపై మరి కొన్ని ఆకారాలను గుర్తించారు. ఒక చోట సీతాకోక చిలుక ఆకారం కనిపించింది. మరోచోట ఒక కొండ నత్త ఆకారం, దాన్నే మరో వైపు నుంచి చూస్తే కుక్క ఆకారం కనిపించింది. నవ్వుతున్న ముఖంతో కూడిన ఆకారం, ప్రేమగుర్తు కూడా ఎంఒసి చిత్రాల్లో కనిపించాయి. కొన్ని చిత్రాలలోని ఆకారాలు అంగారకుడిపై చెట్లు ఉన్నాయనే వాదనను లేవనెత్తాయి. అయితే శాస్త్రవేత్తలు ఈ వాదనను కొట్టిపారేశారు. ‘‘అంగారకుడిపై ఏర్పడిన ధూళిమేఘాలు వివిధరూపాలు ధరించి చెట్ల రూపాన్ని గుర్తుకు తెస్తున్నాయి తప్ప అక్కడ ఎలాంటి చెట్లు లేవు’’ అన్నారు వాళ్లు.
2007లో తీసిన ఒక ఫోటోలో ఒక వ్యక్తి మోకాళ్ల మీద కూర్చొని ప్రార్థన చేస్తున్న ఆకారం కనిపించింది. దీని ఆధారంగా ‘అంగాకుడిపై జీవులు ఉన్నాయనే దానికి ఇదొక నిదర్శం’ అని వాదించిన వాళ్లు ఉన్నారు.
కొన్ని సంవత్సరాల క్రితం అంగారుకుడిపై మిథేన్ వాయువు ఆనవాళ్లు కనుగొనడంతో అంగారకుడిపై జీవుల గురించి ఆసక్తి మళ్లీ తాజాగా మొదలైంది. అంగారకుడికి సంబంధించిన సమాచారంలో నిష్ణాతుడిగా పేరుగాంచిన ప్రొఫెసర్ కోలిన్ (బ్రిటన్) ‘అంగారకుడిపై జీవుల ఉనికిని నిర్ధారించడానికి మీథేన్ వాయువు బలమైన నిదర్శనం’ అని చెప్పారు. అంగారకుడిపై వాతావరణం లేని కారణంగా పగటి ఊష్ణోగ్రతకు, రాత్రి ఊష్ణోగ్రతకు మధ్య చాలా తేడా ఉంటుంది. ఫలితంగా అక్కడ జీవులు మనుగడకు అవకాశాలు తక్కువ అని కొందరు శాస్త్రవేత్తలు కోలిన్ నమ్మకాన్ని తోసిపుచ్చారు.
అంగారకుడిపై ఆశ్చర్యం గొలిపే ఆకారాలపై ఆసక్తి ఈనాటిది కాదు. 1784లో బ్రిటీష్ ఆస్ట్రానమర్ సర్ విలియమ్ హర్‌స్కెల్ ‘అంగారకుడిపై చీకటిగా కనిపించే ప్రాంతాలు సముద్రాలు, చీకటి తక్కువగా ఉన్న ప్రాంతాలు భూభాగం’ అని రాశారు. 1895లో పెర్సివల్ లొవెల్ అనే ఆస్ట్రానమర్ ‘మార్స్’ అనే పేరుతో రాసిన పుస్తకంలో అంగారకుడిపై కాలువలు ఉన్న విషయాన్ని రాశాడు. అయితే ఆ తరువాత కాలంలో ఇది అవాస్తవంగా రుజువైంది. తక్కువ నాణ్యత ఉన్న టెలిస్కోప్‌ల కారణంగా ఆనాటి శాస్త్రవేత్తలు అంగారకుడిలోని ఆకారాలను రకరకాలుగా అర్థం చేసుకున్నారు. దర్పణభ్రమకు గురయ్యారు.
‘‘అంగారక గ్రహానికి ప్రత్యేకత ఉంది. అది ఎప్పటికప్పుడు మన భూమిని గుర్తుకు తెస్తుంది. ఏదో ఒక రోజు మనం అక్కడికి వెళ్లే వాళ్లమే’’ అన్నారు నాసా శాస్త్రవేత్త జిమ్ గార్విన్. మన భూమికి పొరుగు గ్రహమైన అంగారకుడితో ఒకప్పుడు మనకు బీరకాయపీచు బంధుత్వం ఉండేది. ఆ తరువాత అది దూరపు బంధుత్వంగా మారింది. ఇప్పుడు మాత్రం అంగారకుడితో మనకు దగ్గరి చుట్టరికం. చుట్టపు చూపుగా రేపో మాపో మనం అక్కడికి వెళ్లొచ్చు. సీతకోక చిలకతో చెలిమి చేయవచ్చు. గాంధీతాతతో మాట్లాడవచ్చు! అక్కడ సుసంపన్నమైన నాగరిత వెలిగి ఉంటే ఆ వెలుగు జాడలు వెదికి చూడవచ్చు. వేచి చూద్దాం! - యాకూబ్ పాషా
ఆర్థర్ సి. క్లార్క్ రాసిన తొలి సైన్స్ ఫిక్షన్ నవల ‘ది సాండ్స్ ఆఫ్ మార్స్’. 1951లో ప్రచురించబడిన ఈ నవల మంచి ఆదరణ పొందింది. మార్టిన్ గిబ్బన్ అనే సుప్రసిద్ధ సైన్స్ ఫిక్షన్ రచయిత అంగారక యాత్ర చేస్తాడు. అంగారక గ్రహం ప్రధానాధికారిని కలుస్తాడు. ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు. అంగారకుడిపై కంగారులను పోలిన జీవులను చూస్తాడు. అక్కడ మొక్కలను పెంచుతారనే విషయాన్ని తెలుసుకుంటాడు...ఇలా అంగారకుడికి సంబంధించి చిత్రవిచిత్ర విషయాలన్నీ ఈ నవలలో ఉన్నాయి. అంగారకుడిపై నీటి కాలువలు ఉన్నాయనే ఊహ ఆధారంగా క్లార్క్ ఈ నవల రచించాడు.


Tuesday, December 4, 2012

మరో భూమి కోసం మానవ అన్వేషణ



ఆ మధ్య 'అవతార్‌' అని ఒక సినిమా వచ్చింది. అందులో ఆకట్టుకునే అంశం ఒకటుంది. అదేమంటే 'పండోరా' అనే గ్రహం మీద కూడా (భూమి కాకుండా) మన వంటి జీవజాలం వుండడం. సినిమా కల్పనే కావచ్చు. జీవాలు ఉన్న గ్రహం అనేది ఊహ నుండి పుట్టిన సృజనే కావచ్చు. కానీ ఆధారం లేకుండా అటువంటి ఆలోచనలు ఆవిర్భవించవు కాబోలు. మనలో అంతర్గతంగా పాతుకుపోయిన 'గ్రహాంతర జీవం' అనే అంశం అభివృద్ధి చెంది ఆ విధంగా రచనల్లో, సినిమాల్లో బయటికి వస్తోంది కాబోలు. కానీ ఇకపై ఈ 'కాబోలు' కబుర్లు కట్టిపెట్టవచ్చు. భూమి వంటి గ్రహాలు ఇంకా అంతరిక్షంలో వున్నాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఇహనో.. ఇప్పుడో... వాటిపై జీవం ఉందో లేదో కూడా తెలిసిపోతుంది.
ఎందుకో తెలియదు కానీ మనిషికి మొదటినుండి అంతరిక్షంపై అవ్యాజమైన ప్రేమ. అంతరిక్షంలో తిరిగే గ్రహాలను తన జీవిత గమనానికి ముడిపెట్టుకున్నాడు. కొన్ని గ్రహాలను దేవుళ్లుగా, దేవతలుగా చేసుకున్నాడు. సూర్యుణ్ణి భగవానుడు అన్నాడు. మరణించిన కొందరు మానవులను నక్షత్రాలుగా చేసేశాడు. శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత గ్రహాలూ మామూలు భౌతిక పదార్థాలే అని తెలిసింది. చంద్రునిపై కాలు పెట్టి అక్కడి మన్నూ, రాళ్లూ తెచ్చి చంద్రుడు 'మామ' కాడు, పిలిస్తే రాడు అని తేల్చి పారేసింది. రోవర్ల సాయంతో అంగారకుని ఉపరితలాన్ని భూమి మీద నుండే అధ్యయనం చేసింది. సౌరకుటుంబంలోని గ్రహాల విశేషాలను, వివరాలను దాదాపు తెలుసుకుంది. అయితే ఇదంతా మన సౌరకుటుంబం పరిధికే పరిమితమైంది. ఈ విశ్వంలో మనం కాక మరొక జీవ ప్రపంచం ఉందేమో అన్న అనుమానం మనిషిని వదలలేదు. అందుకు తగ్గట్టు గ్రహాంతర వాసుల కోసం అన్వేషణ ఆరంభమైంది. ఈ క్రమంలో 'అదిగో పులి అంటే ఇదిగో తోక' అన్నట్టు ఎన్నో పుకార్లు. ఒకవేళ గ్రహాంతర వాసులు వుంటే గింటే ఎలా ఉంటారో అని సృజనాత్మకత చూపిన వారు కొందరైతే, అచ్చంగా అటువంటి వారినే చూశామని చెప్పిన వారు కొందరు. ఒక పక్క అటువంటి 'గ్రహాంతర జీవాన్వేషకులు' తమ విధిలో నిమగమై ఉంటే, అసలు విశ్వంలో ఇతర సౌర కుటుంబాలు ఎన్ని వున్నాయి? వాటిలో జీవానుకూలమైన గ్రహాలూ ఏమైనా ఉన్నాయా? అన్న వెదుకులాటలో కొందరున్నారు. ఈ అన్వేషణలో వెలికి వచ్చే ఫలితాలు మనకి (మనిషికి) మేలు చేస్తాయో లేదో తెలీదు కానీ, ఏదో కొత్త విషయం మాత్రం తెలియొచ్చు. అంతరిక్షం అనంతమైందన్న అవగాహన మనకు వుంది. అటువంటి అంతరిక్షాన్ని అన్వేషించడమూ అనంతంగా సాగుతూనే వుంది. ఆ అన్వేషణ ఎందుకోసం అంటే... మన గ్రహము, సౌర కుటుంబము, అసలు విశ్వపు తాలూకు పూర్వాపరాలను తెలుసుకోవడం కోసం అనే చెప్పాలి. ఆ క్రమంలో ఎన్నో వింతలు, అద్భుతాలు, ఆశ్చర్యపరిచే విషయాలూ వెలికి వచ్చాయి. ఇంకా వస్తున్నాయి.
మనకు అతి సమీప నక్షత్రమైన సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలలాగే లక్ష లక్షల నక్షత్రాల చుట్టూ కూడా గ్రహాలు ఉండి ఉంటాయని అనుకునేవారం. కానీ 1995లో మరొక నక్షత్రం చుట్టూ పరిభ్రమించే గ్రహాన్ని తొలిసారి గుర్తించడంతో పరిస్థితి మారిపోయింది. ఇక అప్పటి నుండి సౌర కుటుంబానికావల 708 గ్రహాలను కనుగొని, వాటిని నిర్థారించి, శాస్త్రీయ పట్టిక రూపొందించడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తైతే, పని చేయడం మొదలు పెట్టిన పదహారు మాసాలకే కెప్లర్‌ టెలిస్కోప్‌ 2,326 గ్రహాల వంటి వాటిని కొనుగొంది. అయితే వాటిలో 31ని మాత్రమే నిజమైన గ్రహాలుగా పరిగణించారు.
ఇటీవల భూమి వంటి మరో గ్రహాన్ని అంతరిక్ష పరిశోధకులు గుర్తించారు. ఆ భూమి వంటి గ్రహం భూమి వంటి పరిమాణం కలిగి, ఒక సూర్యుని వంటి నక్షత్రం చుట్టూ భూమిలాంటి దూరంలోనే పరిభ్రమిస్తోంది. అంతేకాదు, దానిపై భూమి వంటి ఉష్ణ్రోగ్రతే 22 డిగ్రీల సెల్సియస్‌ ఉంది. రెండేళ్ల నుండి అంతరిక్షంలో అన్వేషణ కొనసాగిస్తున్న 'కెప్లర్‌' అనే దూరదర్శిని ఈ భూమి వంటి కొత్త గ్రహాన్ని గుర్తించింది. ఇదొక్కటే కాదు, కెప్లర్‌ ప్రతి మూడు నాలుగు నెలలకీ వందల కొద్దీ 'గ్రహాల' ఆచూకీ కనిపెడుతోంది. ఇంత భారీ స్థాయిలో గ్రహాల ఉనికి దొరుకుతుంటే గ్రహాల వేటగాళ్లలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. అతి తొందరలోనే భూమి వంటి గ్రహం కంట పడుతుందన్న నమ్మకంతో వారున్నారు. ఆ మధ్య అంగారక గ్రహంపై నీటి ఆనవాళ్లు దొరికాయనీ, మన ఉపగ్రహమైన చంద్రుడిమీద కూడా జలం వుండేదనడానికి గుర్తులూ లభించాయని సంతోషించారు. ఈ విశాల అనంత విశ్వంలో ఎక్కడో ఒక చోటైనా జీవం తాలూకు జాడలు ఉండి ఉంటాయని, ఆ మాటకొస్తే జీవులే ఉండి ఉంటాయనీ మన విశ్వాసం. ఇటీవలి కాలంలో బయల్పడుతున్న ఇతర 'ఆవాస యోగ్య గ్రహాల' ఆచూకీ మన విశ్వాసాన్ని మరింత పెంచుతోంది.
మరో భూమి!
కెప్లర్‌ టెలిస్కోప్‌ కనిపెట్టిన నూతన గ్రహం పేరు కెప్లర్‌ 22బి. ఈ గ్రహం సూర్యుని వంటి నక్షత్రం చుట్టూ తిరిగే తొలి 'ఆవాస యోగ్య' గ్రహం. అంటే మన భూమిలాగే అక్కడ కూడా ప్రాణికోటి నివసించగలదన్నమాట ఇంతకు ముందు కనిపెట్టిన గ్లీస్‌581డి, హెచ్‌డి85512బిజి గ్రహాలు కూడా ఆవాస యోగ్య పరిధి లోనే ఉన్నాయి. కానీ అవి కాస్త చిన్న, తక్కువ ఉష్ణోగ్రత గల నక్షత్రాల చుట్టూ తిరుగుతున్నాయి.
కెప్లర్‌ 22బి భూమి కంటే 2.4 రెట్లు పెద్దది, మనకు 600 కాంతి సంవత్సరాల దూరాన ఉంది. అది ఒకసారి తన సూర్యుడి(నక్షత్రం)ని చుట్టి రావడానికి 290 రోజులు తీసుకుంటుంది. అంటే అక్కడి సంవత్సరం మన సంవత్సరం కంటే చిన్నది. ఆ గ్రహ వాతావరణం వెచ్చగా, జీవాభివృద్ధికి అనుకూలంగా ఉన్నట్లు తెలిసినా, దాని ఉపరితలం ఘనరూపంలో ఉందో లేక జల, వాయు రూపంలో ఉందో తెలియదు. కానీ కొందరు మాత్రం ఈ విశ్వంలో మనం ఏకాకులం కాదంటున్నారు. అంటే భూమిలాంటి గ్రహాలు మరికొన్ని వున్నాయంటున్నారన్నమాట. ఈ కొత్త గ్రహంపై నీరు ద్రవ రూపంలో ఉండడమే కాకుండా, అది సముద్రాల రూపంలో ఉండొచ్చని అంటున్నారు. ఇంకొంతమంది ఇంకాస్త ముందుకెళ్లి అక్కడ ఆల్రెడీ ప్రాణులు ఉన్నాయంటున్నారు. అంతరిక్ష పరిశోధక సంస్థ నాసా ప్రకారం ఈ గ్రహం ప్రాణులు నివసించడానికి వీలుగా ఉంది. కానీ దీని గురించి సంపూర్ణ సమాచారం లభించడానికి దశాబ్దాలో, శతాబ్దాలో పట్టొచ్చు. మరి ఆరు వందల కాంతి సంవత్సరాలకు ఆవల ఉన్న గ్రహం గురించి తెలుసుకోవడం అంత సులభం కాదు కదా. కొన్ని వందల కిలోమీటర్ల దూరాన ఉన్న చంద్రుడి గురించి వివరాలు సేకరించడానికి, దానిపై కాలు మోపడానికే మనకు డెభ్బై ఏళ్ల సమయం పట్టింది.
మనకి ఆరువందల కాంతి సంవత్సరాల దూరమంటే ఊహించుకోవడం కష్టమే. ఒక కాంతి సంవత్సరం మన కిలోమీటర్ల లెక్కలో పది ట్రిలియన్ల కిలోమీటర్ల దూరం. ట్రిలియన్‌ అంటే 1000000000000 (ఒకటి పక్కన పన్నెండు సున్నాలు). మైళ్ల లెక్కలో అయితే 3,526,800,000,000,000 మైళ్లు. చాలా దూరమే! గంటకు 22,315 మైళ్ల వేగంతో ప్రయాణిస్తే, ఆ గ్రహాన్ని చేరడానికి సుమారు ఇరవై మిలియన్‌ సంవత్సరాల కాలం అవసరం!! అంత దూరాన జీవం ఉంటే ఏం, లేకపోతే ఏం. అయితే చాలామంది ఈ కొత్త గ్రహాన్ని కనిపెట్టడంపై ఆనందోత్సాహాలు వ్యక్తపరుస్తున్నారు. ఇంత అన్వేషణ తర్వాత ఏంటి అనేది ప్రశ్న. ఒకవేళ నివాస యోగ్యమైన గ్రహం గానీ గుర్తించబడితే మనం అక్కడికి వెళ్లి డేరా వేయొచ్చా? అనడిగితే కుదరదంటున్నారు శాస్త్రజ్ఞులు. పైగా అసలు కెప్లర్‌ 22బి పైన ఇప్పటికే జీవులు ఉండొచ్చేమో అన్న అనుమానం ఉంది. మనకు అతి దగ్గరగా ఉన్న నక్షత్రం నాలుగు కాంతి సంవత్సరాల దూరాన ఉంది. ఇప్పటికి అందుబాటులో వున్న అత్యంత వేగవంతమైన రాకెట్ల సహాయంతో దానికి చేరువగా వెళ్లడానికే కొన్ని వేల సంవత్సరాల కాలం పడుతుంది. భూమి వంటి గ్రహాన్ని గుర్తించడం ఒక దశ. ఆ గ్రహం నుండి వెలువడే కాంతిని నేరుగా విశ్లేషించడం తర్వాతి దశ. దీనిద్వారా అక్కడి వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని రాబట్టవచ్చు. అప్పటి వరకూ అసలు ఆ గ్రహంపై జీవం ఉందో లేదో తెలిసే అవకాశమే లేదు.
కెప్లర్‌ ఘనత
ఖగోళ శాస్త్రంలో గొప్ప పేరు తెచ్చుకున్న జోహాన్నెస్‌ కెప్లర్‌ డిసెంబర్‌ 27, 1571న జన్మించాడు. పాతికేళ్లకే అతను 'మిస్టీరియం కాస్మోగాఫికం' అనే గ్రంథం రచించాడు. అందులో తనను ప్రభావితం చేసిన కోపర్నికస్‌ ప్రతిపాదనలను సమర్థించాడు. పైగా ఎన్నో రంగాలలో తన మేథను చూపాడు. మరెన్నో రంగాలలో ఆద్యుడిగా నిలిచాడు. అందులో కొన్ని...
* గ్రహాల కదలికలను తొలిసారిగా కచ్చితంగా వివరించాడు. తత్ఫలితంగా కొన్ని సూత్రాలను ప్రతిపాదించాడు.
* దీర్ఘ దృష్టి, హ్రస్వ దృష్టి కొరకు కంటి అద్దాల నమూనా రూపొందించాడు.
* రెండు కళ్ల వల్ల దృష్టి ఎలా ఉంటుందనేది వివరించాడు.
* తన గ్రంథం 'డయాప్త్రిసిస్‌'లో టెలిస్కోప్‌ ఎలా పనిచేస్తుందో వివరించాడు.
* చంద్రుడి వల్ల ఆటుపోట్లు ఎలా కలుగుతాయో ముందుగా వివరించాడు. గెలీలియో దాన్నే నిరూపించాడు.
* సూర్యుడు ఒక అక్షంపై తిరుగుతాడని చెప్పాడు.
* క్రీస్తు జన్మదినం లెక్కగట్టి ప్రతిపాదించాడు. ఇప్పుడు అదే తేదీని ప్రపంచమంతా పాటిస్తోంది.

* 'శాటిలైట్‌' అనే పదాన్ని పుట్టించాడు.అనంత విశ్వంలో అన్వేషణ

గ్రహాలను ఎలా గుర్తిస్తారు?
విశ్వాంతరాళం లోని రహస్యాలను కనిపెట్టడం ఒకప్పుడు ఊహకు కూడా అందనిది. అయితే, ఈ రోజు సాంకేతిక విజ్ఞానం మనిషికి ఎంత సాయపడుతుందో ఊహకి అందడం లేదు. అత్యంత వేగంగా ప్రయాణిస్తేనే గమ్యం చేరడానికి వేల, లక్షల ఏళ్లు పట్టేంత దూరాన ఉన్న ఖగోళ పదార్థాలను గుర్తించడం అసంభవం అనుకోవడం నుండి 'ఇదిగో చూడండి, కనిపెట్టాం' అనే స్థాయికి చేరుకున్నాం. గ్రహాలు సూర్యుని వంటి నక్షత్రాల చుట్టూ పరిభ్రమిస్తాయని మనకు తెలుసు. నక్షత్రాల నుండి కాంతి వెలువడుతుందనీ తెలుసు. ఒక కాంతి జనకం ముందు ఏదైనా పదార్థం ప్రయాణించినప్పుడు ఆ కాంతిలో కాస్త మార్పు (తగ్గుదల) వస్తుందని తెలుసు. ఇదే జ్ఞానంతో ఇప్పుడు ఖగోళ మండలంలో గ్రహాలను వెతుకుతున్నారు.
కెప్లర్‌ దూరదర్శిని. కొన్నికోట్ల కిలోమీటర్ల దూరాన ఉన్న నక్షత్ర మండలాలను గుర్తించడానికి రూపొందించబడింది. కెప్లర్‌ని నాసా మార్చ్‌6, 2009న అంతరిక్షంలోకి పంపింది. మన పాలపుంతను వడగడుతూ, అందులోని కోట్లాది నక్షత్రాల చుట్టూ తిరుగుతూ, జీవులకు అనువైన గ్రహాలను కనిపెట్టడమే కెప్లర్‌ విధి. మూడున్నర సంవత్సరాల కాల పరిధిలో అది తన విధి నిర్వహించాలి. కెప్లర్‌లో గొప్ప పరికరాలు కూడా ఏమీ లేవు. కేవలం అతి సున్నితమైన ఫొటోమీటర్‌, కొన్ని సెన్సార్లు ఉంటాయి. దానికి కావలసిన శక్తిని సోలార్‌ పానెళ్ల ద్వారా సూర్యుని నుండి గ్రహిస్తుంది. తన మూడున్నర సంవత్సరాల కాలంలో కెప్లర్‌ సుమారు లక్ష నక్షత్రాల ప్రకాశ మార్పులను పసిగడుతుంది. ఒక నక్షత్రం ముందు నుండి ఒక గ్రహం ప్రయాణిస్తే, ఆ నక్షత్ర కాంతిలో కొంత మార్పు వస్తుంది. కెప్లర్‌ అటువంటి మార్పులను చక్కగా గుర్తించగలదు. ఆ మార్పు రెండు నుండి పదహారు గంటల వరకూ ఉండొచ్చు. ఒకవేళ ఆ మార్పు కచ్చితమైన కాలానుగుణంగా ఉంటే అది ఒక గ్రహం అని నిర్థారిస్తారు. పైగా అటువంటి మార్పు అదే మోతాదులో, అదే కాలానుగుణంగా పదే పదే జరిగితేనే ఆ గ్రహ ఉనికిని నిజమైనదిగా గుర్తిస్తారు. ఒకసారి గ్రహ నిర్థారణ జరిగాక, దాని పరిభ్రమణ పరిధిని లెక్కగడతారు. తన నక్షత్రం చుట్టూ ఒకసారి తిరగడానికి ఆ గ్రహం తీసుకునే సమయాన్ని ఇందుకు ఉపయోగిస్తారు. అలాగే ఆ గ్రహం దాటినప్పుడు తగ్గిన నక్షత్ర కాంతిని బట్టి ఆ గ్రహం పరిమాణాన్ని లెక్క గడతారు.
అయితే ఇదంతా చెప్పినంత సులభం కాదు. ఒక భారీ నక్షత్రం ముందు నుండి ఒక గ్రహం వెళ్లినప్పుడు ఆ నక్షత్ర కాంతిలో కలిగే మార్పు కారు హెడ్‌ లైట్ల ముందు నుండి ఒక దోమ వెళ్తే కలిగే మార్పులా ఉంటుంది. మరి అంత సూక్ష్మ మార్పుని పసిగట్టడమంటే సవాలే. ఇక భూమి వంటి గ్రహాన్ని గుర్తించడమంటే ఆ హెడ్‌ లైట్ల ముందు దోమ ఆనవాలు పట్టడమే. అటువంటి సవాలుని కెప్లర్‌ సమర్ధవంతంగా ఎదుర్కొని పని చేస్తోంది.
పేరు ఎలా పెడతారు?
కొత్తగా కనిపెట్టిన గ్రహాలకు పేర్లెలా పెడతారు? అన్న అనుమానం వస్తుంది. ఉదాహరణకు ఇటీవల కనిపెట్టిన మన భూమి వంటి గ్రహాన్ని కెప్లర్‌ 22బి అని పిలుస్తున్నారు. కాల్పనిక ప్రపంచంలో (పుస్తకాలు, సినిమాలు) అటువంటి గ్రహాలకు కాస్త అందమైన పేర్లు కూడా ఉన్నాయి. పండోరా(అవతార్‌ చిత్రంలో), ఎండోర్‌, అరకిస్‌ వంటివి. కానీ వాస్తవిక ప్రపంచంలో మనకి గ్లీస్‌ 581డి, హెచ్‌డి85512, కెప్లర్‌ 22బి వంటి పొడి పేర్లు ఉన్నాయి. నిజానికి కనిపెట్టిన ప్రతి గ్రహానికీ మంచిపేర్లు పెట్టాలని ఒక ప్రతిపాదన వచ్చింది. బహుశా ఏ గ్రీకు, రోమన్‌ పేరులో పెట్టమని వుండవచ్చు. కానీ ఆ ప్రతిపాదనను ఎవరూ అంతగా పట్టించుకోలేదు. పైగా దానివల్ల అసలు ప్రక్రియ నెమ్మదౌతుందని ఒక అనుమానం. ఎందుకంటే పేరు పెట్టడానికి ముందుగా ఒక అంతర్జాతీయ అవగాహన కావాలి. అందుకు సమయం పట్టవచ్చు. ఇక్కడ కొత్త గ్రహాలేమో దాదాపు రోజుకొకటి చొప్పున వెలికి వస్తున్నాయి! (2010లో 385 కొత్త గ్రహాలను కనిపెట్టారు). ప్రస్తుతం కొత్త గ్రహాలకు పేర్లు పెట్టే పద్ధతి సులభంగానే వుంది. ఒక గ్రహాన్ని కంటితో చూడగలుగుతున్నామంటే దానికి ఒక పేరు ఉండి తీరుతుంది. టెలిస్కోప్‌ ద్వారా కనిపెడితే దానికి ఒక ప్రత్యేక స్థాయి (స్టేటస్‌) ఇస్తారు. బహుళ నక్షత్ర వ్యవస్థలో కనిపెట్టిన ఒక్కో నక్షత్రానికి సిరియస్‌ బి, సిరియస్‌ బి అని పేర్లు పెడతారు. వాటి చుట్టూ ఉన్న గ్రహాలకు చిన్న అక్షరాలను జోడిస్తారు.
ప్రస్తుతం ఇప్పటి వరకూ తెలియని, పేరు పెట్టని గ్రహాలను అన్వేషిస్తున్నారు. 'కెప్లర్‌' అనే అంతరిక్ష టెలిస్కోప్‌ కొత్త నక్షత్ర కూటములను పరిశీలిస్తోంది. ఆ కూటమిలో కనిపెట్టబడిన ప్రతి నక్షత్రానికి కెప్లర్‌ అనే పేరు ఉంటుంది. కెప్లర్‌ 22 అంటే అది ఆ కూటమిలో ఇరవై రెండవ నక్షత్రం అని అర్ధం. ఇక ఆ నక్షత్రం చుట్టూ తిరిగే గ్రహానికి చిన్న ఆంగ్ల అక్షరం ఉంటుంది. అలా ఇప్పుడు కనిపెట్టబడిన గ్రహం పేరు కెప్లర్‌ 22బి అయ్యింది. (గ్రహం పేరులో ఎప్పుడూ ''ఎ'' పెట్టరు). కెప్లర్‌ గుర్తించిన పదకొండవ నక్షత్ర కూటమి కెప్లర్‌ 11. అందులో ఆరు గ్రహాలు ఉన్నాయి. అంటే వాటి పేర్లు బి నుండి జి వరకు ఉంటాయి. 11బి, 11సి, 11డి... ఇలా. అలాగే వాస్ప్‌ (షaరజూ), కారట్‌ (షశీతీశ్‌ీ) అనే టెలిస్కోప్‌లు కనిపెట్టిన గ్రహాల పేర్లు ఆ టెలిస్కోపుల పేర్లతోనే మొదలౌతాయి.
అయితే అన్ని ఖగోళ పరిశీలనలకూ ఇటుంటి పేర్లు ఉండవు. అంగారక గ్రహం గుర్తించిన లోయలకు భూమిపైన లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణాల పేర్లు పెట్టాలని నాసా నిర్ణయించింది. ఫలితంగా అంగారక గ్రహం ఉత్తరార్థం లోని ఒక లోయకు స్కాట్లాండ్‌ లో ఉన్న 'బాల్వికార్‌' అనే పట్టణం పేరు, దక్షిణార్థంలోని ఒక దానికి 'బ్రిస్టల్‌' అనే పేరు వచ్చాయి. అయితే అసంఖ్యాకంగా ఉండే నక్షత్రాలకు ఆ విధమైన నామకరణం సాధ్యం కాదు. ఏదేమైనా 'కెప్లర్‌' అన్న పేరు కూడా అంత తక్కువదేమీ కాదు. కెప్లర్‌ అనేది పదహారవ శతాబ్దపు జర్మన్‌ ఖగోళ శాస్త్రవేత్త పేరు. ఆయన ఆషామాషీ మనిషి కాడు. సూర్యుడి చుట్టూ గ్రహాలు ఎలా పరిభ్రమిస్తున్నాయో వివరించాడు. దాని ఆధారంగా తరువాత న్కూటన్‌ గ్రహాలు ఆ విధంగా ఎందుకు పరిభ్రమిస్తాయో వివరించాడు.
ఇకపోతే శాస్త్రీయ పరిశోధనకు కొన్ని సమస్యలున్నాయి. మనకు తెలియని విషయాలను తెలియజేయడం వరకూ బానే ఉంది గానీ బోలెడు డబ్బు, సమయం వెచ్చించి వెలికి తీసిన విషయాలు మానవ జీవనానికి ఏ విధంగా ఉపయోగపడతాయన్న ప్రశ్న కొందరిని వేధిస్తుంది. సరే భూమి వంటి గ్రహం ఇంకొకటి కాకపోతే ఇంకో కోటి ఉండొచ్చు. వాటిమీద మనలాంటి వారూ, కాకపోతే ఇంకోలాంటి వారూ ఉండొచ్చు. అయితే ప్రస్తుతం మనకి అందువల్ల ఒనగూడే లాభం గానీ నష్టం గానీ ఏమిటి? చంద్రునిపై ఏముందో తెలుసుకుని ఏం చేశాం? అంగారకుడిపై ఒకప్పుడు నీరు ఉండి నేడు ఆవిరైపోయి ఉంటే ఏం చేస్తాం అంటారు వీళ్లు. అయితే శాస్త్రవిజ్ఞానరంగంలో ప్రతి మైలురాయికీ ఇంటువంటి దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. స్వంతానికి కోట్లు సంపాదించుకునే స్పోర్ట్స్‌మెన్‌ వల్లా, ఆ క్రీడల వల్లా, కోట్లలో చేసే సినిమా వ్యాపారం వల్లా సామాన్య మానవుడికి ఒరిగింది ఏమీలేదు. ఇటువంటి వాటికంటే శాస్త్రపరంగా ఎదగడం, విస్తరించడం, వివరించడం, విజ్ఞానాన్ని పంచడం మంచిదే కదా. మనందరం వెళ్లి కెప్లర్‌ 22బి పైన ప్లాట్లు కట్టేదీ లేదు. అక్కడ ఎవరైనా వుంటే వారు వచ్చి భూమిపై ప్లాట్లు కొనేదీ లేదు. కానీ శాస్త్ర పరిశోధన విశ్వ రహస్య వివరాలను మన ముందు విప్పి ఆరబోస్తోంటే ఆనందించడానికి అడ్డేముంది?